Logo

ఓయూలో 120 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు

ఓయూలో 120 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు

హైదరాబాద్, మే 24 : ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దాదాపు 120 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ స్పష్టం చేశారు. రీఫార్మ్, ఫర్మార్మ్, ట్రాన్స్ ఫార్మ్ లో భాగంగా రెండేళ్లలో తాము చేపట్టిన సంస్కరణలు, ప్రగతిని మూడో ఏడాది సుస్థిరం చేస్తామని వెల్లడించారు. ఓయూ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరావు పూర్తైన సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణతో కలిసి ప్రగతి నివేదికను ఆవిష్కరించారు.  పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం… అకడమిక్, పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయటం…  విద్య, పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపటమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయని  ప్రొఫెసర్ రవిందర్ ఆనందం వ్యక్తం చేశారు.

చారిత్రక, ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసే అవకాశం రావటం సంతోషంగా ఉందన్న ఆయన… మరో వందేళ్ల పాటు ఉస్మానియా తన కీర్తి, ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆర్థికమంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి సహా ప్రభుత్వ సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే క్రతువు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

NIRF ర్యాంకింగ్ లో ఓయూ 22వ స్థానాన్ని సాధించటం, “WCRC లీడర్స్ ఆసియా, వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022”  యూకే లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో అవార్డు అందుకోవటం తమ బాధ్యతను మరింత పెంచిందని ప్రొఫసెర్ రవిందర్ యాదవ్ గుర్తు చేశారు. 120 కోట్ల రూపాయలతో బాలుర వసతి గృహాలు, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, శతాబ్ది పైలాన్, ఓపెన్ ఎయిర్ థియోటర్ సహా అనేక మౌళికవసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఇంజినీరింగ్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లు ఒక్కో ఛైర్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరు మూడు కోట్ల రూపాయల చొప్పున నిధులు అందించిన విషయాన్ని వెల్లడించారు. ప్రొపెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద మైనింగ్ విభాగంలో ఇద్దరు సింగరేణి ఉద్యోగులు అధ్యాపకులుగా పనిచేస్తున్నారని అన్నారు.

ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమూహాన్ని ఒక్కచోటకు చేర్చి తొలిసారిగా గ్లోబల్ అల్యుమిని ఏర్పాటు చేసి…. సెక్షన్ 8 కంపెనీ కింద ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని ప్రొఫెసర్ రవిందర్ తెలిపారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వవిద్యార్థి లోకం ఉస్మానియాగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఆస్కారం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష్ లాంటి కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు జరుపుతున్నామని వెల్లడించారు. అకడమిక్ క్యాలండర్ ను సరిదిద్ధటం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ కు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరటంతో పాటు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామని చెప్పారు. ఇంజినీరింగ్ లో… కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, మైనింగ్, బీఏ హానర్స్, ఏ కోర్సు చదివిన వారైనా… ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ లో పీజీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

క్లస్టర్ విధానం,  హ్యూమన్ కాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, ప్లేస్ మెంట్ సర్వీసెస్, గ్లోబల్ ఎడ్యుకేషన్ కోసం శిక్షణా కార్యక్రమాలు, సివిల్ సర్వీసెస్ అకాడమీ, స్టూడెంట్ డిస్కోర్స్ సెంటర్, హెచ్ఆర్డీసీ, సీబీసీఎస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, తెలంగాణ అధ్యయన కేంద్రం, ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రాలను కొత్తగా అందుబాటులోకి తెచ్చామని వీసీ తన ప్రగతి నివేదికలో పేర్కొన్నారు. దాదాపు పది విదేశీ విశ్వవిద్యాలయాలతో పరస్పర అవగాహనా ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. లాంటి పైరవీలు, ఒత్తిళ్లకు తావులేకుండా ఆన్లైన్ అర్హత పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పిహెచ్డీ ప్రవేశాలు దక్కేలా చూశామని… ఓయూ  విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి అశ్రిత పక్షపాతానికి, భయానికి తావు లేకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్శిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా పతాకాన్ని ప్రపంచ యవనికపై ఎగురవేసేందుకు కలిసి ముందుకు సాగాలని ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ స్టీవెన్ సన్, ప్రొఫెసర్ జి. మల్లేశం, ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ప్రొఫెసర్ సి. గణేష్, ప్రొఫెసర్ వీరయ్య, ప్రొఫెసర్ ప్యాట్రిక్ సహా ఆయా కళాశాల ప్రిన్సిపళ్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking