రైతుగా… పెళ్లి ఫొటో షూట్
పెళ్లి కుదరగానే ఏర్పాట్ల సంగతులు అటుంచి… బెస్ట్ ఫొటోగ్రాఫర్ ఎవరన్నది చూసుకుని వెడ్డింగ్ షూట్లు చేయించుకుంటున్నారు ఈ తరం వధూవరులు. అందరి కంటే భిన్నంగా ఉండాలని కొందరూ, మంచి మంచి లొకేషన్లలో ఫొటోలు దిగాలని మరికొందరూ ఆరాటపడుతున్నారు. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు.
తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన కార్తీక్ కూడా అలానే ఆలోచించాడు. అయితే ఖర్చు గురించి కాకుండా పల్లె సౌందర్యాన్నీ, శ్రమజీవనాన్నీ, రైతు దినచర్యనీ తన వెడ్డింగ్ షూట్ ద్వారా కళ్లకు కట్టాలనుకున్నాడు.
అందుకే ఈ మధ్య పెళ్లి కుదిరి నిశ్చితార్థం అయిపోగానే తన భాగస్వామి హైందవితో కలిసి పల్లెబాట పట్టి రైతన్నగా మారిపోయాడు. మాసిపోయిన దుస్తులు ధరించి… అరక దున్నుతూ, నాగలి మోస్తూ, గడ్డి కోస్తూ, చద్దన్నం తింటూ… ఇలా రకరకాల కోణాల్లో రైతు జీవితాన్ని చూపిస్తూ ఫొటోలు దిగాడు.
రైతు కుటుంబంలో పుట్టి… పొలం గట్లపైన ఆడుకుంటూ పెరగడమే ఈ ఫొటో షూట్‌కి కారణమైందంటాడు కార్తీక్.
– శేరు పోశెట్టి, ఆర్మూర్.