Logo

బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ

బహుజన చక్రవర్తి

ఛత్రపతి శివాజీ జయంతి

చక్రవర్తి ఛత్రపతి ఫిబ్రవరి 19 జన్మదినం. ఇది 393 వ జయంతి.. 

ఏ అసమాన కులవ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కలిపించి జాతీయభావనని కల్పించాడో.. ఏ బ్రాహ్మణ వర్గం ఈ దేశంలో సువిశాల భూభాగాన్ని జయించిన చక్రవర్తిని సూద్రుడనే కారణంతో గుర్తించ నిరాకరించి ఈసడించిందో నేడు అదే వర్గ భావాజాలం బహుజనులైన బీసీ లకు కులవ్యవస్థ అమానుషాలని భరించలేక మతం మారిన తమ తోటి మూలవాసి సోదరులైన ముస్లింలపై ద్వేషం పెంచే విధంగా మరియు మతం మత్తులో తమ కళ్ళని తమ వేళ్ళతోనే పొడుచుకునే విధంగా అకారణంగా ముస్లీం వ్యతిరేక గళo విప్పే విధంగా మాయచేస్తూ ఈ దేశ అతి గొప్ప బహుజన మూలవాసి చక్రవర్తి అయినా ఛత్రపతి శివాజీ ని ముందు పెట్టడం ఈ దేశ బహుజనుల పాలిటి విషాధం.

1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్భీ( కాపు) – ఓబీసీ లో పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన శివాజీ జీవితం ప్రజాస్వామ్య దేశంలో బానిస్ బ్రతుకు బ్రతుకుతున్న బహుజనులకు వీపు మీద ఒక చరుపులాంటిది. రాజ్యం కాదు ప్రజలు తమదిగా భావించే స్వరాజ్యంలో రైతులు స్త్రీలు అస్పృశ్యులు గిరిజనులు సామాన్యులను ఎలా భాగస్వామ్యం చేయాలో బహుజన రాజ్య నిర్మాణం ఎలా ఉండాలో అనే ప్రణాళిక కి ఆయన పాలన విధానం మాతృక లాంటిది.

జాతీయ భావన లేని , దేశ ప్రేమ లేని ఆధిపత్య గుంపు తమ స్వార్థం కోసం శారీరక శ్రమ తెలియని గుంపు ఎవరు కొత్త రాజుగా వచ్చినా పరుగెత్తి వెళ్ళి పాదాల చెంత మోకరిల్లి విధేయతను ప్రకటించుకుంటూ కులకర్ణిలుగా ( పట్వారీ ) పటేoడ్లుగా , దేశముఖ్ లు దేశపాండేలు జాగీర్‌దారులుగా తమ పీఠాలకు డోకా లేదనే హామి తీసుకొని అడుగులకు మడుగులొత్తుతూ పాదాలను తమ చేతుల్లోకి తీసుకొని తమకు నచ్చిన రీతిలో పాలన సాగిస్తూ ప్రజలను రైతులను వేధిoచుక చంపుతూ ఖజానా నింపుతుంటే రాజ్యమంటే దోపిడి అని రాజు అంటే క్రూరుడని ప్రజలు భావిస్తున్న కాలంలో.., రైతులకు భూములని కొలిపించి న్యాయమైన పన్ను నిర్ణయం చేసి కరువు సమయంలో పన్ను మినహాయింపునివ్వడమే గాకుండా అదనపు సాయాన్ని అందించి దేశముఖ్ దేశపాండేలు తన రాజ్యంలో గతంలోలాగా అరాచకాలకు పాల్పడితే సహించేది లేదనీ వాళ్ళు కూడా ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా రైతుల వలే సాదారణ ఇండ్లల్లో నివాసం ఉండాలనీ హుకుం ఈ దేశ సామాన్య ప్రజలకు ఈ దేశం మీద ప్రేమ కల్పించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ .

శూద్రుడైన ఛత్రపతి శివాజీ సైన్యం లో ఉన్న వారు ఒక తరం చచ్చిపోతే మళ్ళి పిల్లలు పుట్టి పెరిగేదాకా వేచి చూచే బలహీన తక్కువ సంఖ్య కల క్షత్రియ సైన్యం కాదు. అది ఈ దేశమూలవాసులైన ముస్లిములు ఆస్పృస్యులు ( మహర్ మాoగ్ ) గిరిజనులు (రామోషి ) మంగలి చాకలి సకల కులాలు మొదలు పంట పూర్తైనంక ఆక్టోబర్ నుండి ఎప్రిల్ వరకు సైన్యంలో ఇష్టంగా పని చేసిన రైతులది . శ్రమతో సంబంధం గల ఈ మట్టి మనుషులు బయట స్త్రీలు కనిపిస్తే తమ ఇళ్ళల్లో తల్లి కూతుళ్ళను గుర్తుకు తెచ్చుకుంటారే తప్ప మానభంగం చేయరు.

పంటలు గొల్లగొట్టరు. నాశనం చేయరు. తమ రాజు ఇస్తున్న సరిపోయే జీతాలవల్ల రాజు ఆజ్ఞ ప్రకారం డబ్బులివ్వకుండా ఎవరి దగ్గర వస్తువులు తిండి పదార్థాలు జబర్‌దస్తీ గా తీసుకోరు. శివాజీ దళితులని దుర్గాధిపతులని చేసిండు. శివాజీ గూఢాచారి విభాగం (ఇంటెలిజెన్స్ ) అధిపతి బాహిర్జీ నాయక్ గిరిజన రామోషి తెగ వ్యక్తి. నౌకాదళంలో సముద్రంలో చేపలు పట్టే కోలీ , సొంకాలీ , భండారీ (మాన్యక్ భండారీ) లాంటి మట్టి మనుషులని సైన్యంగా మార్చిండు. అది జాతీయ సైన్యం . అది దేశమంటే తమ రాజ్యమంటే ప్రేమ గల నిజమైన సైన్యం. అందుకే అపుడు ప్రజలు ఈ దేశం మాది రాజు మా నాయకుడు అని భావించారు.

అలా విదేశీ ముస్లీంల దండయాత్రతో భారత్ దేశం విదేశీయుల పాలైన సంధర్భంలో ఈ దేశంలో తిరిగి స్వరాజ్యాన్ని స్థాపించింది ఇక్కడి మూలనివాసులే. ఆ మూలనివాసీల బహుజనుల నాయకుడు శివాజీ . బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. క్షత్రియులు మాత్రమే యుద్దాలు చేయాలి , రాజ్యమేలాలి.వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి.

శూద్రులు పై మూడు వర్గాలకి సేవ చేయాలన్న సంధర్భంలో.. నాలుగు శాతం ఉన్న క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేమని గ్రహించిన వ్యవసాయ కులానికి చెందిన మరో కున్భీకాపు సంత్ తుకారాం ( భక్త తుకారాం ) గురువుగా ఛత్రపతి శివాజీకి హితబోధ చేస్తాడు. ఆ మేరకు శివాజీ రాజ్యంలో జూన్ నుండి అక్టోబర్ నాటికి పంట చేతికి వచ్చినంక రైతులందరు దసరాకి(బలి చక్రవర్తి గుర్తుగా ) సైనిక శిక్షణ తీసుకోని సంక్రాంతి నుండి ( పంట ఇంటికి చేరినంక ) యుద్ధాలలో పాల్గొని శివాజి సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తరు .

ఈ దేశంలో తిరిగి రైతులచే ,సామాన్యులు , మహిళలచే స్వరాజ్యం స్థాపించబడిoది. శివాజీ సైన్యంలో పెద్ద ఎత్తున రైతులతో పాటు మిగతా శూద్రులు , అతిశూద్రులు ( దళితులు ) , ఆదివాసీ రామోషి లాంటి తెగలు , ముస్లీంలు (మతం మారిన ఈ దేశ మూలనివాసీలు) పనిచేసిండ్రు. ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి పోయి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా పరిపాలనా / అధికార భాషగా ఆంగ్లమును కొనసాగిస్తూ సాదారణ గ్రామీణ ప్రజలనుండి గ్రాడ్యేట్ వరకు బ్యాoక్ లో ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలియని ప్రస్తుత పరిస్ధితిని పోల్చుకుంటే ఛత్రపతి శివాజీ తన కాలంలో పరిపాలన భాష అయినా పర్షియన్ ని తొలగించి ప్రజల భాష మరాఠీ నే పరిపాలన భాషగా చేసిండు. స్వదేశీ వాణిజ్యం పరిశ్రమలు కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆ రోజుల్లోనే భారీ సుoకాలు విధించిండు. భారతదేశంలో స్త్రీ పురుషులని సంతలల్లో అమ్మడం కొనడం చేసే రోజుల్లో బానిస వ్యా పారాన్ని నిషేధించిండు.

శివాజీకి స్త్రీలపై ప్రత్యేక ప్రేమ

స్త్రీల విషయంలో శివాజీ చాలా ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్న వ్యక్తి. 1678 లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ చేలాది దుర్గం ముట్టడి0చి సావిత్రిబాయి దేశాయ్ అనే ఆ దుర్గాధిపతిని మానభంగం చేస్తే శివాజీ కళ్ళు పీకించి యావజ్జీవ కారాగారవాసం విధించిండు. కళ్యాణ్ సుబేదార్ ని ఓడించాక ఆమె కోడలిని ఒక యోధుడు శివాజీకి కానుకగా సమర్పిస్తే ఆమెని చూసి శివాజీ ‘మా అమ్మ ఇంత అందంగా ఉంటే నేనెంత అందంగా ఉండేవాడినేమో ! ‘ అని ఆమెని తిరిగి సగౌరవంగా వెనక్కి పంపిస్తాడు. రాంజ గ్రామ అధికారి పాటిల్‌ ఓ పేద రైతు కూతురిని మానభంగం చేస్తే ఆత్మహత్య చేసుకుంటది. అది తెలిసిన శివాజీ పాటిల్‌ కాళ్ళు చేతులు ఖండించే తీవ్రమైన శిక్ష ని విధించి వెంటనే అమలు చేస్తాడు. శివాజీ తీర్పు విన్నoక రంగే పాటిల్ అక్కడ ఉన్న దాదాజి కొండదేవ్ తో ‘ అర్హత ఉన్న వాళ్ళే తీర్పు చెప్పాలీ ‘ ఆ అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది లేదా రాజుకి ఉంటుoది అని శివాజీ యొక్క కులాన్ని ప్రశ్నిస్తాడు.

శివాజీకి పట్టాభిషేకం బ్రాహ్మణుడు దూరం

ఒక సువిశాల మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి ఏ బ్రాహ్మణుడు ముందర రాలేదు  కారణం శివాజీ శుద్రుడు కాబట్టి.హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గగాభట్ అనే బ్రహ్మాణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషెకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలు తో గగాభటుడు శివాజీ నుదిటకి తిలకం దిద్ది రాజ్యాభిషేకం చేస్తాడు .వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని ధర్మం విధించింది.

శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణవాదం

ముసల్మాన్ రాజు కావచ్చు కానీ సూద్రుడు కాలేడు. మహా చక్రవర్తి ఐన శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణవాదం ఆ తర్వాత తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది. భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్లు మూఢవిశ్వాసాన్ని ప్రచారం చేసారు.నిజానికి అది అపుడు పోర్చుగల్ లో తయారు చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియం లో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది. ఛత్రపతి బ్రాహ్మణమతానికి లోబడి పని చేసిండు. అవలంభిoచిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లిములకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయ వాదానికి ప్రతీకగా నిలబెట్టారు. శివాజీ ముస్లీం వ్యతిరేకి ఐతే తన సైన్యంలో మూడవ వంతు ముస్లీములెలా ఉంటారు? శివాజి ముస్లిం వ్యతిరేకి అయితే శివాజీ సాయుధ దళాలలో ముఖ్యమైన ఆయధాగార అధిపతిగా ఒక ముస్లిం ని నమ్మి ఇబ్రహీం ఖాన్ ని ఎలా నియమించుకుంటాడు ?

శివాజీ నౌకాదళాధిపతి దౌలత్ ఖాన్ ఒక ముస్లిం
శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ ఒక ముస్లిం . ఈ మదాని మెహతర్ శివాజీని ఔరంగజేబ్ ఆగ్రాలో బంధించినపుడు మారు వేషంలో శివాజీ కోస తన ప్రాణాలొడ్డి తప్పించుకొనుటకు సాయం చేస్తాడు. స్వర్ణ మందిరంపై కాల్పులు జరిపించిందని మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు అంగరక్షకులు చంపేసినపుడు నిజంగానే శివాజీ ముస్లిం వ్యతిరేకి అయితే ప్రాణాలు తీయడం పోయి ప్రాణాలు ఇవ్వడానికెందుకు సిద్దపడుతాడు? శివాజీ కి సన్నిహితుడు , విదేశి వ్వవహరాల మంత్రి ముల్లా హైదర్ ఒక ముస్లిం . సలేది యుద్దం తర్వాత ఔరంగజేబు సైన్యాధికార్లతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరపున దూతగా కాజీ హైదర్ అనే ముస్లీముని పంపిస్తాడు.

శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు దర్గాని కట్టించిండు. అంత గొప్ప ఈ దేశ బహుజన మూలవాసి చక్రవర్తి శివాజీ ని ఈ రోజు బ్రహ్మానీకరణం చేసీ మనల్ని మోసం చేస్తుంటే దాన్ని తెల్సుకోకుండా మతం మత్తులో అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణీయ మాయాజాలంలో నిండా మునిగి తెలవిలేక పావులా బీసీలు మారడం విచారకరం.

ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు ( ఓబిసి) కావున బ్రాహ్మణిజం అoతగా అవమానపర్చి చివరికి హత్య చేస్తే ఈ రోజు అదే బీసీ వర్గం బ్రహ్మాణవాదాన్ని తన భుజస్కందాల పై మోస్తుంది. కాబట్టి బీసీలు ఈ అగ్రవర్ణ కుట్రల్ని గ్రహించి తిప్పికొట్టి ఈ దేశంలో తొలిసారిగా 50%. రిజర్వేషన్స్ కల్పించిన శివాజీ మనుమడైన ఛత్రపతి సాహుమహరాజ్ ఇచ్చిన ‘ ఎవరి జనాభా ఎంతో..,. వారి వాటా అంత ‘ అనే నినాధం స్పూర్తిగా బుద్దుడు చెప్పిన బహుజనుల హితం కోరే బహుజనుల సుఖం కోరే బహుజన రాజ్య నిర్మాణం దిశగా బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో అడుగు వేయడంలో భాగంగా ఊరూరా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలని ఫిబ్రవరి 19న ఘనంగా జరుపుకుందాం . మహాత్మ జ్యోతి బాపూలే చెప్పినట్లు ఆ ‘కుల్వాడీ భూషణ్ ‘ ( కాపులలో శ్రేష్ట్రుడు ) ఆలోచన విధానాన్ని పల్లెపల్లెన ప్రజల్లోకి తీసుకెళదాం

– పత్తేపురం విజయ్ కుమార్

1952 చారిత్రక మరాఠీ చిత్రం “ఛత్రపతి శివాజీ” నుండి క్లిప్ ఇది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking