Logo

నాందేడ్ లో సభ సక్సెస్ కు బీఆర్ ఎస్ సీరియస్

నాందేడ్ బహిరంగ సభ బాధ్యతలు భుజాన వేసుకున్న

నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులు..

సభ ఫెయిలైతే ఎలానో అనే టెన్షన్ నాయకుళ్లో..

గులాబీమయంగా మారిన గురుగోవింద్ సింగ్ జీ మైదానం

జన సమీకరణపై స్పెషల్ ఫోకాస్

నాందేడ్ : ‘‘వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది’’ అనే సామెత గుర్తుకు వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలో గల నాందేడ్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి నిదుర లేకుండా నాయకులు కష్ట పడుతున్నారు.

ఒకవేళ సభ సక్సెస్ కాకుంటే తమ పరువు పోతుందని భావించిన ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిజానికి నాందేడ్ లో తలపెట్టిన బహిరంగ సభ బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కానుంది.

నాందేడ్ లో వేదిక..

ఫిబ్రవరి 5న నిర్వహిస్తున్న బిఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంగణం ముస్తాబవుతోంది. అదిరిపోయే రీతిలో సభ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్నారు. నాందేడ్ నగరంలోని గురుగోవింద్ సింగ్ మైదానం బీఆర్ఎస్ తొలి రాష్ట్రేతర సభను అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి ఆవిర్భావ సభ ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది. తదుపరి నాందేడ్ లో సభను నిర్వహించడానికి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన కేసీఆర్ సభలకు ఏమాత్రం తీసిపోకుండా విస్తృతమైన ఏర్పాట్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

నాందేడ్ లో జనసమీకరణ పై దృష్టి..

భారీ బహిరంగ సభ ఏర్పాట్లను గడిచిన వారం రోజులుగా కీలక నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు నాందేడ్ సరిహద్దుల్లో ఉండడంతో జిల్లాలకు చెందిన బిఆర్ఎస్ నేతలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు భాద్యతలు అప్పగించారు.

ఎంపీ బిబిపాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్, ఆర్మూర్, జుక్కల్, బోధన్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, షకీల్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు తో పాటు పలువురు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నాందేడ్ సభలో భారీగా చేరికలకు సన్నాహాలు

దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి చేరికల జరగగా, మహారాష్ట్రలో నుంచి అనేకమంది ప్రజాప్రతినిధులు ఇటీవలే కేసీఆర్ ను కలిశారు. ఇదే క్రమంలో నాందేడ్ బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరికలు జరిగేలా నేతలు గ్రామాల వారిగా తిరుగుతున్నారు.

ఒకవైపు చేరికలపై సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సభకు జనాన్ని తరిలించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బిబిపాటిల్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రవీందర్ సింగ్, ఎమ్మెల్యే షకీల్ లు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో చేరికలు జరుగుతున్నాయి.

దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించనున్న నాందేడ్ సభ
నాందేడ్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో సభ ద్వారా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కీలకమైన ప్రసంగం చేయనున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా తొలిసారి పొరుగు రాష్ట్రాల్లో టిఆర్ఎస్ సభను ఏర్పాటు చేయనుండడంతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల దృష్టి నాందేడ్ సభ పైనే కేంద్రీకృతమై ఉంది.

ప్రతిసారి కేసిఆర్ సభలకు భారీ ఎత్తున జనాలను సమీకరించడం ఉద్యమ కాలం నుంచి వస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసిఆర్ సభలకు లక్షలాదిగా జనాన్ని సమీకరిస్తారు. అదే కోణంలో నాందేడ్ సభకు భారీగా జన సమీకరణ చేసి అధికార బిజెపికి సవాల్ విసిరాలని అధినేత కేసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు అనుగుణంగానే లక్షల్లో జనాన్ని నాందేడ్ లోని గురు గోవింద్ సింగ్ జి మైదానానికి తరలించే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు.

ఇదివరకే యవాత్మల్ హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తో ఎమ్మెల్యే మైనంపల్లి చర్చలు జరిపారు. అలాగే రెండు రోజుల క్రితం రాష్ట్ర మహిళ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నేతలు కేసీఆర్ ను కలిసి మద్దతు తెలిపారు.

ప్రస్తుత నాందేడ్ జడ్పీ చైర్మన్, మహారాష్ట్ర రాష్ట్ర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సురేష్ అంబులగేకర్ , నాందేడ్ జిల్లాలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మెన్లు, మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎంప్లాయ్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బాబురావు పజర్వాడ్, నాందేడ్ టీచర్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్ గంధపవడ్, ధర్మభాధ్ మాజీ మేయర్ దిగంబర్ లక్మావార్ లు కేసీఆర్ తో చర్చించారు. పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే నాందేడ్ జిల్లా సరిహద్దులోని యవత్మల్, మహోర్, కిన్వాట్, నర్సి, దేగ్లూర్, పర్భని తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మరాఠాలను సభకు తరలించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. బీఆర్ఎస్ విధానాలను, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను దృష్టి పెట్టుకొని అనేకమంది కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా భారీగా జనాన్ని సభకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు పొరుగునే నాందేడ్ ఉండడంతో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనాన్ని మహారాష్ట్రకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన బీఆర్ఎస్ నాందేడ్ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పే అవకాశాలున్నాయి.

  • వయ్యామ్మెస్

Leave A Reply

Your email address will not be published.

Breaking