Logo

మధ్యంతర ఎన్నికలు అమ్మో బాబోయ్ మహా కాస్ట్లీ..

అసెంబ్లీ ఎన్నికలు మహా కాస్ట్లీ గురూ..

డబ్బు.. డబ్బు.. ఈ డబ్బులతోనే ఎన్నికలలో గెలుస్తున్నారు పొలిటికల్ లీడరులు.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలుస్తామనే గ్యారంటీ లేదు. దొందు దొందేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బును నమ్ముకునే పోటీ పడే కాలం ఇది. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారనేది జగమేరిగిన సత్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో మధ్యంతర ఎన్నికలలో రాక పోవచ్చు. మరో పది నెలలో జనరల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తాత్కలికంగా ఈ నిర్ణయం వాయిదా పడోచ్చు.

తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని అంటున్నారు. అవును ఇందులో రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి సందేహం లేదు. ఉప ఎన్నికల విషయంలోనే రికార్డులను తిరగరాసిన చరిత్ర ఉన్న తెలంగాణలో జనం తమ తమ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేసిన హిస్టరీ ఉంది. అటువంటిది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ ఒకే సారి ఎన్నికలు జరుగుతుంటే.. గత రికార్డులు తుడిచిపెట్టుకు పోవడం ఖామయని అంటున్నారు. ఔను రాకార్డుల గురించే ఇక్కడ చెప్పుకుంటున్నాం. 2012 అక్టోబర్ లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక అప్పటికి ఒక రికార్డు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును తిరగరాసింది.

ఇప్పడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలు గత రికార్డులన్నిటినీ తిరగరాయడం ఖాయమని జనం భావిస్తున్నారు. అలా తిరగరాయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. కాదు.. కాదు మీరనుకుంటున్నట్లుగా రికార్డులు ఎన్నికల ఫలితాల గురించీ కాదు.. మెజారిటీ స్థానాలు, మెజారిటీ ఓట్ల విషయంలోనూ కాదు.. పోలింగ్ శాతం విషయంలోనూ కాదు. ఓటరు చైతన్యం విషయంలో అంత కంటే కాదు. ఇక్కడ మనం ఎన్నికల వ్యయం రికార్డుల గురించి చెప్పుకుంటున్నాం. ఔను ఎన్నికల ఖర్చు విషయంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రికార్డులను తిరగరాస్తాయని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎప్పటికీ చెరగని మరకగా మిగిలిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉన ఎన్నిక హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరకను మరిచిపోయేలా అంత కంటే పెద్ద మరకను మిగిల్చింది.

హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాలా ఇన్ని కోట్లని ఎవరూ లెక్కకట్టలేదు కానీ.. అయిన ఖర్చు మాత్రం చెప్పలేము. తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల పైమాటగానే అప్పట్లో చెప్పుకుంటున్నారు. కానీ శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలల్లో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని అధికారిక గణాంకాలే సూచించాయి. ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల రూపాయల విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విశ్లేషణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేశారని అప్పట్లో సామాన్య జనమే నెలల తరబడి చెప్పుకున్నారు.

అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కోట్లలో సోమ్ము కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ‘అత్యంత’ఖరీదైన ఉప ఎన్నికగా అప్పట్లో చరిత్ర సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు తెరాస నాయకులను బహిరంగంగా నిల దీశారు. ధర్నాలు చేశారు. ఇది కూడా చేశారు. అదీ హుజురాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో సృష్టించిన మరో ‘చరిత్ర’. వాస్తవానికి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అప్పట్లో అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేశారు. అంతలా రికార్డులు సృష్టించిన ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గానికి గత ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది.

ఆ ఉప ఎన్నిక హుజూరాబాద్ రికార్డులను తిరగరాసింది. అధికార బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్), ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ఖర్చు విషయంలో పోటీలు పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఓటర్ల డిమాండ్ కారణంగా పార్టీలు పోటీలు పడక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తిందనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఓటర్ల అంచనాలను రీచ్ కావడానికి మూడు ప్రధాన పార్టీలూ వ్యయం విషయంలో ఆకాశాన్నే హద్దుగా పెట్టుకున్నాయి. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకూ ఒక్కో ఓటుకు పందేరం చేశాయన్న మాట.

ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఎంత తక్కువగా చూసుకున్నా వంద కోట్లకు పైమాటేనని అంటున్నారు. వాస్తవంగా ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు. కానీ అన్ అఫిషియల్‌గా అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయగలిగిన ఆర్థిక స్థోమత ఉన్నవారు మాత్రమే రంగంలోకి దిగుతారనడంలో సందేహం లేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking