గుంటూరు జిల్లా : దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలకు కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి చైర్మన్ లను డైరెక్టర్లను నియమించి వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాజ్య సభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర కృష్ణ బలిజ పూసల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పని చేస్తున్న కోలా భవాని మణికంఠ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, పెదకాకాని గ్రామంలోని రాజ్య సభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్య సభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అతి తక్కువ సమయంలోనే నవరత్నాల పథకాల ద్వారా బీసీలలో ఉన్న 139 ఉప కులాలకు డిబిటి, నాన్ డిబిటి పద్దతి ద్వారా ఒక లక్ష 75 వేల కోట్ల రూపాయలను నేరుగా అర్హుల ఖాతాలకే జమ చేయటం జరిగిందన్నారు.
అనంతరం రాష్ట్ర కృష్ణ బలిజ పూసల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని మణికంఠ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక బీసీలంతా సీఎం జగన్ వెంటే ఉంటారని.. రానున్న ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధించే లక్ష్యంలో భాగస్వాములు అవుతామని చెప్పారు..ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోలా అశోక్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశం వెంకటేశ్వరరావు, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.