Logo

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు

న్యూఢిల్లీ, మార్చి 24, రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చడమే కాకుండా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు.

ఉదయం లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు రాహుల్. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారు సెక్రటరీ జనరల్. “పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీని సూరత్ దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని వాయనాడ్‌ ఎంపీగా ఉన్న ఆయనపై అనర్హతా వేటు వేస్తున్నాం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం”

చట్ట ప్రకారమే..
ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం…ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా…లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలూ ఉన్నాయి. అయితే…ఈ తీర్పుపై న్యాయ పోరాటం కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఒకవేళ పైకోర్టులో ఊరట లభిస్తే రాహుల్ అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ సూరత్ కోర్టు తీర్పుని ఏ హైకోర్టు కూడా కొట్టివేయలేదంటే మరో 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోతారు రాహుల్. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో భయపడేదే లేదు అని తేల్చి చెబుతోంది. ట్విటర్‌ డీపీని కూడా మార్చింది. రాహుల్ ఫోటోపై “ఢరో మత్” అని కోట్ చేసి అదే డీపీని పెట్టుకుంది.

ఇదీ కేసు..
ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది” అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు…రాహుల్‌కు శిక్ష విధించింది. అయితే వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఈ పిటిషన్ వేశారు. రాహుల్ ప్రధాని మోదీని దారుణంగా అవమానించారని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ఆ వర్గాన్ని కించపరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌పై ఐపీసీ సెక్షన్స్ 499,500 ప్రకారం పరువు నష్టం కేసు నమోదైంది. 2021 అక్టోబర్‌లో రాహుల్ సూరత్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. పూర్తి విచారణ తరవాత ఆయనను దోషింగా తేల్చింది సూరత్ కోర్టు.

Leave A Reply

Your email address will not be published.

Breaking