Logo

గణతంత్ర దినోత్సవంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

గణతంత్ర దినోత్సవంలో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టాలి

చేవెళ్ల: గణతంత్ర దినోత్సవం లో అంబేద్కర్ ఫోటో ప్రతి దగ్గర కచ్చితంగా పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత కడమంచి నారాయణ దాస్ అన్నారు.

ఈ మేరకు ఏసీపీ రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు, డిటి రాజశేఖర్ సిఐ వెంకటేశ్వర్లకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకపోవడం ఆయనను అవమానించడమే అవుతుందన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థలలో కూడా ఆయన పట్ల వివక్షత చూపిస్తున్నారని అన్నారు.

రాజ్యాంగ రచనకు, ఆమోద ప్రక్రియలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు పెట్టి అంబేద్కర్ ను విస్మరించడం సరైంది కాదన్నారు.

రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఇలాంటి పరిస్థితి రావడం దేశానికే సిగ్గుచేటు అన్నారు.

తరాల క్రితం నాటి కుల వివక్షతను నేటి ప్రజాస్వామ్య, లౌకిక దేశంలో పాటించడం అనైతికం అన్నారు.

అంబేద్కర్ గురించి ఈ సమాజం తెలుసుకుంటే సమానత్వం వైపు ప్రజలు ఆలోచిస్తారని, సమానత్వాన్ని సహించని అనేకమంది ఇలాంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారానే దేశంలో సోదర భావం పెరుగుతుందని, తద్వారా దేశం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

భూమిపైన ఏ ప్రాణిలో లేని అసమానతలు మనిషిలో ఉండడం విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు.

ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ జ్ఞానాన్ని భారతదేశ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆయన దేశంలో ఏ ఒక్క వర్గం కోసం పనిచేయలేదని, అందరికీ స్వేచ్ఛ, హక్కులు కల్పించారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

కావున ఇప్పటికైనా జాతీయ జెండా ఎగురవేసే ప్రతి దగ్గర అంబేద్కర్ ఫోటో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి భాస్కర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking