Logo

జనం నోట అన్నమయ్య సంకీర్తనలు

జనం నోట అన్నమయ్య సంకీర్తనలు

– కొత్తగా బాణీలు కట్టిన సంకీర్తనలు నాద నీరాజనం వేదికపై గానం

– ఎస్వీబీసీ తో పాటు అన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం

టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి

తిరుమల, ఫిబ్రవరి 7 : శ్రీ వేంకటేశ్వర స్వామి పై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటిని జనంనోట పలికించేందుకు విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.

ఇప్పటిదాకా బాణీలు లేని సంకీర్తనలను అర్థ, తాత్పర్యాలతో సహా జనంలోకి తీసుకుని వెళ్లేందుకు టీటీడీ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈవో శ్రీ ధర్మారెడ్డి సోమవారం శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 270 కీర్తనలను స్వరపరచిన గాయకుల చేత తిరుమల నాద నీరాజన వేదికపై ఆ సంకీర్తనలను గానం చేయించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమం ఎస్వీబీసీ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఈ సంకీర్తనలన్నీ టీటీడీ వెబ్సైట్ తో పాటు అన్ని సామాజిక మాధ్యమాలు, యుట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంకీర్తన ప్రసారంతో పాటు టెక్స్ట్ కూడా డిస్ప్లే అయ్యే ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి వివరించారు. రెండో విడతగా 340 సంకీర్తనలను స్వరపరచే ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు.ఈ బాధ్యత తీసుకున్న స్వరకర్తలు వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని కోరారు.

కొత్తగా స్వర పరచి రికార్డింగ్ చేసిన అన్నమాచార్య సంకీర్తనలను టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో గాయకులతో పాడించడంతో పాటు, ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అన్నమాచార్య సంకీర్తనలు అందరికీ అర్థమయ్యేలా జన బాహుళ్యంలోకి తీసుకుని వెళ్లేందుకు టీటీడీ చేస్తున్న కృషికి సహకారం అందించాలని కోరారు.

ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచెంద్ర,జేఈవో శ్రీమతి సదా భార్గవి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ తో పాటు పలువురు గాయకులు, స్వరకర్తలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking