Logo

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జాబ్ మేళా

అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఆకాంక్ష
-నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి
-విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలే
-పేద విద్యార్దులకు అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు
-జాబ్‌ మేళాతో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం
జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్

మంథని : అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఆకాంక్ష అని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్య నిర్మూలనకు తనవంతు కృషి చేస్తున్నానని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. సోమవారం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌ మేళాను మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,భూపాలపల్లి జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ గారు మాట్లాడుతూ ఎంతో మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ నిరుద్యోగులుగా ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎంతో మంది తనవద్దకు తల్లిదండ్రులను తీసుకువచ్చి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని కోరడం బాధాకరంగా ఉందన్నారు. ఉన్నత విద్యాబ్యాసం చేసిన యువత తమ విద్యార్హతకు తగిన ఉద్యోగం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని నిరుద్యోగుల కలలకు సాకారం చేకూర్చాలన్న ఆలోచనతో 52 బహుళజాతి కంపెనీల సహకారంతో పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో జాబ్‌ మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

గతంలో జాబ్‌మేళా ద్వారా ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సుదూర ప్రాంతాలని ఆ అవకాశాలను వదులుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ జాబ్‌ మేళాలో మాత్రం ప్రతి ఒక్కరు తమ విద్యార్హతకు తగిన ఉద్యోగ అవకాశాలను ఆయా కంపెనీలలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎంతో యువకులు ఉద్యోగ అవకాశాలు ఉన్నా సుధూర ప్రాంతాలని, వేతనం తక్కువని తమకు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారని, ఎవరు కూడా అలా చేయకూడదని హితవు పలికారు. ఎక్కడ ఉద్యోగ అవకాశం వచ్చినా ఎంత వేతనం ఉన్నా వదులుకోవద్దన్నారు.

ఒకప్పుడు ఉద్యోగాల కోసం పట్టణాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఉండేవని, అలాంటి పరిస్థితులు ఈప్రాంత నిరుద్యోగ యువతకు రావద్దన్నదే మా ఆలోచన అని అన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించి వారి కాళ్లపై వాళ్లు నిలబడే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత పేద ప్రజలకు తనవంతు సాయం అందించాలన్నదే తన సంకల్పమని, ఇందులో బాగంగానే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. పదేళ్ల క్రితమే తనతల్లి పేరున ట్రస్టును స్థాపించి పేద బడుగు బలహీనవర్గాలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్ధుల భవిష్యత్‌ గురించి ఆలోచన చేసి ప్రభుత్వ కళాశాలల్లోని పేద విద్యార్ధులకు మధ్యాహ్న బోజనం అందించడం జరుగుతోందన్నారు. అలాగే విద్యార్ధుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా ప్రతి కళాశాల, మోడల్‌ స్కూల్‌ల్లో మోటివేషన్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాన్ని సైతం చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఎంతో మంది పేద విద్యార్ధులకు పుట్ట లింగమ్మ ట్రస్టు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ జాబ్‌మేళాలో 52 బహుళజాతి కంపెనీ ప్రతినిధులు హజరవుతున్నారని, విద్యార్హతకు తగిన ఉద్యోగాలకు వెంటనే ఎంపిక చేస్తారని, ప్రతి ఒక్కరికి ఈ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు వచ్చిన వారు తమ వేతనం ద్వారా ప్రతి నెల ఒక్క రూపాయి పుట్ట లింగమ్మ ట్రస్టు విరాళంగా ఇవ్వాలని ఆయన ఈ సందర్బంగా కోరారు. భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ మాట్లాడుతూ తాను ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లానని, ఆనాడు ఉద్యోగాల కోసం ఎంతో కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చేదన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు గొప్పగా ఆలోచన చేసి పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా మెగా జాబ్‌ మేళాను ఏర్పాటు చేయడం అదృష్టంగా బావించాలని అన్నారు. 52బహుళజాతి కంపెనీలతో ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాన్ని సాధించుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం గొప్పగా ఆలోచన చేసే నాయకుడు పుట్ట మదు అని, అలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారని అన్నారు. నిరుద్యోగులు ఎవరిపై ఆధారపడకుండా ఉద్యోగ అవకాశం కల్పించి వారికి మంచి భవిష్యత్‌ ఇవ్వాలని ఆలోచన చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. అనంతరం వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ స్టాళ్లను జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking