Logo

కొండగట్టు బస్సు ప్రమాద కుటుంబాలను ఆదుకోవాలి

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం

జగిత్యాల, కొండగట్టు ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదం లో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు కెసిఆర్ ఎందుకు వెళ్లడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కొండగట్టు పర్యటన – అక్రమ అరెస్టుల సందర్భంగా బుధవారం ప్రొ. కోదండరాం స్పందించారు.

కొండగట్టు బస్సు ప్రమాదం లో అనేక మంది దుర్మరణం చెంది, వందల కుటుంబాలు చిన్నాభిన్నం అయితే ఈముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పందించలేదని కోదండరాం విమర్శించారు.ఇప్పటికైనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను అందరినీ కెసిఆర్ పరామర్శించాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి లతో పాటు కాంగ్రెస్, బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమాల రథసారథి ప్రొ. కోదండరాం తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు మంత్రి వర్గంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళితే ఆ జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులను సెక్షన్ 151 కింద అరెస్టు చేస్తున్నారని అన్నారు. తీవ్రమైన నేరం జరిగే అవకాశం ఉండి, అరెస్టు చేయక పోతే ఆ ప్రమాదాన్ని ఆపలేని పరిస్థితి తలెత్తుతుందని తేలితే తప్ప సెక్షన్ 151ని వాడ రాదని కోదండరాం స్పష్టం చేశారు.

సెక్షన్ స్వభావాన్ని మరిచి, ప్రభుత్వం దాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైన విచ్చల విడిగా ప్రయోగిస్తున్నదని కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సెక్షన్ 151 దుర్వినియోగాన్ని ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన తెలంగాణ జన సమితి నాయకులను, ఇతర ప్రతిపక్ష నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డమాండ్ చేశారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి అరెస్టులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం అవుతామని ఆయన కెసిఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking