Logo

సీఎం జగన్ కోసం అద్దె ఇల్లు కై అన్వేషణ

మార్చి 22, 23 తేదీల్లో విశాఖలో గృహ ప్రవేశం

విశాఖపట్టణం, ఫిబ్రవరి 7, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి విశాఖపట్నం తరలి వెళ్లే అంశం మళ్లీ తెరైపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ఏపీకి చెందిన ముఖ్యనాయకుడు, మంత్రులు సిఎం విశాఖపట్నం వెళ్తారని అక్కడి నుంచి పరిపాలనా కార్యకలాపాలు నడిపిస్తారని చెబుతున్నారు. నిజానికి 2019 డిసెంబర్‌లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రకరకాల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.మూడు రాజధానుల ప్రకటన తర్వాత రైతుల ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత కోవిడ్ ముంచుకు వచ్చింది. ఆందోళనలు, ఉద్యమాలు, ప్రతిపక్షాల విమర్శలు, పోరాటాల నడుమ రాజధాని అంశంపై కోర్టు కేసులు దాఖలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి నిర్ణయం అసెంబ్లీలో ప్రకటనకే పరిమితం కావాల్సి వచ్చింది.

మూడు రాజధానులపై అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులు మండలిలో నెగ్గకపోవడంతో ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు రాజధాని భూ సమీకరణపై రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలపై ఉపశమనం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ పరిణామాల మద్య విశాఖకు రాజధాని తరలింపు పనులపై క జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. రాజధాని తరలింపుపై ఎలాంటి నిర్ణయం వచ్చినా పాటించేందుకు వీలుగా అధికారులు చర్యలు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని త్వరలో విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్‌ ఇటీవల దిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో సైతం ప్రకటించారు. పలువురు మంత్రులు సైతం కొంతకాలంగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు.

ఈ పరిణామాలపై జిల్లా యంత్రాంగానికి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాకున్నా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం మౌఖిక ఆదేశాలు అందుతున్నట్లు తెలుస్తోంది.రాజధాని తరలింపునకు సంబంధించిన సమాచారం ఏక్షణంలో వచ్చినా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని భవనాలనుపరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ విశాఖలో నివాసం ఉండడానికి బీచ్‌ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమైన ఇల్లు లబిస్తే మార్చి 22, 23 తేదీల్లో గృహ ప్రవేశం ఉంటుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. వీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి రహదారి విస్తరణ పనులను చేపట్టారు. ఈ మార్గంలోనే సీఎం నివాసం ఉంటుందని చెబుతున్నారు.

మంత్రులు కూడా తమకు అనుకూలమైన భవనాల కోసం వెతుకుతున్నారు.మరోవైపు ఏఎంసీ అంకోశా సమీపంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల కోసం చేపట్టిన డూప్లెక్స్‌ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కూడా విశాఖలో నివాసాల కోసం అన్వేషిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన చేసే వెసులుబాటు ఉండటంతో అధికారులు, సిబ్బందిని పూర్తి స్థాయికు తరలింపు ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు విద్యార్దులకు పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలల్లో కార్యాలయాల తరలింపు ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking