ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ గా మలీశా
ముంబై, మే 23, ముంబయిలోని ఓ మురికి వాడ. ఇరుకైన ఇల్లు. అందులో ఓ 14 ఏళ్ల బాలిక. ఆమె కలల్ని ఆ నాలుగు గోడలు అడ్డుకోలేకపోయాయి. మెల్లగా ఇల్లు దాటాయి. అక్కడి నుంచి వాడ దాటి.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. అప్పటి వరకూ చాలా సాదాసీదా జీవితం గడిపిన ఆ బాలిక..ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజీలపైనా తన ఫోటోలు కనిపిస్తుంటే..అవి చూసుకుని తెగ మురిసిపోతోంది. ధారావిలోని మలీశా ఖర్వా కథ ఇది. ఇప్పుడామెని అంతా ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ గా పిలుచుకుంటున్నారు. 2020లో హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్‌మాన్ ఆమెని గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఆమెకు ఆర్థిక సాయం చేయాలంటూ గో ఫండ్ మీ పేజీ క్రియేట్ చేశాడు. ఆ తరవాత ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. అప్పటి వరకూ ఆమె ఎవరో కూడా తెలియని వాళ్లు “ఎవరీ మలీశా” అని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. క్రమంగా ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 25 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కి #princessfromtheslum అనే హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే నెటిజన్లు ఆమెని అలాగే గుర్తిస్తున్నారు మరి. ఫాలోయింగ్ పెరగడమే కాదు.
మోడలింగ్ అవకాశాలూ వచ్చాయి. అలా ఈ ఫీల్డ్‌లోకి వచ్చేసింది మలీశా. లివ్ యువర్ ఫెయిర్ టైల్ అనే షార్ట్‌ఫిల్మ్‌లోనూ తళుక్కుమంది. ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ ఆమెని వెతుక్కుంటూ వచ్చింది. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అనే ఓ కాస్మొటిక్స్ కంపెనీ యువతి సెలక్షన్ పేరిట ఓ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. యువతను ఎంపవర్ చేయడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. ఈ ప్రచారానికి మలీశా ఖర్వాని ఎంపిక చేసింది ఆ కంపెనీ. ఏప్రిల్‌లో ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చింది. అంతే కాదు. ఆమెని వెంటబెట్టుకుని తమ స్టోర్‌కి తీసుకెళ్లింది. ఆ స్టోర్‌కి ఎదురుగా ఓ హోర్డింగ్ కనిపించింది. దానిపై మలీశా తన ఫోటోను చూసి
మురిసిపోయింది. ఒక్కసారిగా తన ముఖం వెలిగిపోయింది.
“కలలు నిజం అవుతాయి అనడానికి ఓ అందమైన ఉదాహరణే మలీశా కథ” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కంపెనీ. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టోర్‌లో మలీశా దిగిన ఫోటోలూ వైరల్ అయ్యాయి. మలీశా లాంటి ఎంతో మంది యువతను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఫౌండర్ మీరా కులకర్ణి చెప్పారు. ఇంత సక్సెస్ వచ్చినా సరే…మలీశా చదువు పక్కన పెట్టలేదు. ఇటు మోడల్‌గా రాణిస్తూనే అటు స్టడీని కంటిన్యూ చేస్తోంది. “ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఆఫర్ వచ్చిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. నాకు మోడల్ అవ్వాలనుంది. కానీ…చదువుకే నా ఫస్ట్ ప్రయారిటీ” అని చెబుతోంది మలీశా ఖర్వా