వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై
మంత్రి కేటీఆర్ స్పందన
హైదరాబాద్ : నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటన చాలా విషాదకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఫిబ్రవరి 19వ తేదీన జరిగిన ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలానికి చెందిన గంగాధర్ తన కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఛే నంబర్ ఛౌరస్తాలో కారు సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తున్న అతను ఆదివారం తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు.
గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ ఆడుకునేందుకు వీధిలోకి వెళ్లాడు. దీంతో అక్కడున్న వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.