Logo

అప్పుల ఊబిలో సర్పంచ్ లు

అప్పుల ఊబిలో సర్పంచ్ లు

ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకునే నాథుడు లేడు..

సర్పంచ్.. గ్రామ ప్రధమ పౌరుడు. ఈ పదవి కోసం లక్షలు.. కోట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పవార్ అంటే అలా ఉంటుంది మరి. ఇప్పుడు ఆ సర్పంచ్ పదవి ఎందుకు వచ్చింది బాబోయ్ అంటుండ్రు. ప్రభుత్వం నిధులను మంజూరు చేయక పోవడంతో అప్పుల ఊభిలో గిలగిలలాడుతున్నారు సర్పంచ్ లు.

సమస్యల చెంత _ సర్పంచుల చింత.. అప్పుల ఊబిలో గ్రామ ప్రథమ పౌరులు.. వెంటనే గ్రామాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్..

హైదరాబాద్ : ప్రజల్లో పరువు నిలుపుకోవడానికి ఆరాట పడుతున్నాడు సర్పంచ్.. గ్రామాల్లో ప్రగతి పేరుతో అధికారుల విధించే లక్ష్యాలు. పూర్తి కాకపోతే అధికారుల హెచ్చరికలు. పనులు చేయకపోతే ప్రజల్లో పరువు పోతుందని ఆందోళన. ప్రజా ప్రతినిధి పదవిని కాపాడుకోవడానికి తప్పని పోరాటం. ప్రభుత్వాలు నిర్దేశించిన అనేక పథకాలను అమలు చేయడానికి సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్న తీరుఒకవైపు, ప్రభుత్వాల నుండి నిధులు మంజూరు కాక, చేసిన పనులకు డబ్బులు రాక గ్రామాల్లోని సర్పంచులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి చేరుకుంది.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలు చాలా ఉన్నాయి. పరిష్కరించాలని సంకల్పం ఉన్నా కూడా ప్రభుత్వాల నుండి నిధులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతూ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఊరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండేది సర్పంచ్‌. ఆర్థిక వనరులను సృష్టిస్తూ, ఆదాయాలను రాబడుతూ గ్రామాన్ని సొంత కుటుంబంగా భావించే ప్రథమ పౌరుడి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.

అప్పులకు రెట్టింపవుతున్న వడ్డీలు

ప్రభుత్వం నిర్దేశించిన ప్రగతిలక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుండి నిధులు వచ్చినా రాకపోయినా సొంత డబ్బుతో పనులు చేయిస్తున్నారు సర్పంచులు. పల్లెప్రకృతివనం నుండి మొదలు పెడితే గ్రామాల్లో సీసీరోడ్ల వరకు పనులు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా వాటికి బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల ఒత్తిడితో ఆగమేఘాల మీద డంపింగ్‌యార్డులు, రైతు వేదికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, శ్మశాన వాటికలు, పల్లెప్రకృతివనాలను పూర్తి చేశారు. కొన్నిచోట్ల మిషన్‌ భగీరథ, భూగర్భ మురుగుకాల్వలను సైతం సర్పంచులు పూర్తి చేశారు. కానీ బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. జనరల్‌ ఫండ్‌, ఆర్థికసంఘం నిధులను సైతం స్తంభింపజేశారని, పంచాయతీ ఖాతాల్లో నిధులున్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి సైతం పనులు చేయిస్తే అప్పుల కంటే వడ్డీలు ఎక్కువ అవుతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుల బాధలు తాళలేక సర్పంచులు ఆత్మహత్యలు సైతం చేసుకునే దుస్థితి తలెత్తుతుంది.

నిధులు అందడం లేదు కేంద్రం నుండి వచ్చే ఉపాధి హామీ చట్టం నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా అందడం లేదు. దాదాపు 11 నెలల నుండి నిధులు లేక సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో సొంతంగా ఖర్చులు పెట్టుకొని అమలు చేయిస్తున్నారు. అయినా సరే నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లను ఇబ్బంది పెట్టేలా ప్రయత్నిస్తుంది. వెంటనేగ్రామాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎంబీలు చేసి ఏడాది గడుస్తున్నా

బిల్లులు ఇవ్వడం లేదు

గ్రామాల్లో పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, ఆటస్థలం, డ్రయినేజీలను, విద్యుత్‌ దీపాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేశాం. ఆయా పనులకు ఎంబీలు చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుండి బిల్లులు రావడం లేదు. అప్పులు చేసి గ్రామాభివృద్ధి చేస్తున్నాం. అప్పులతో ఇబ్బంది పడుతున్నాం. వెంటనే బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking