48 గంటలపాటు పనిచేయడానికి సిద్ధం..
అయినా.. నా ప్రతిభాను తమిళ ప్రజలు గుర్తించడం లేదు
: గవర్నర్ డాక్టర్ తమిళిసైసౌందరరాజన్ ఆవేదన
చెన్నై ఫిబ్రవరి 21 : తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించడం లేదని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసైసౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోయంబత్తూరులోని పీళమేడు ప్రాంతంలో ప్రైవేటు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటైన సభలో ఆమె ప్రసంగిస్తూ.. తన లాంటి ప్రతిభావంతులకు తమిళనాట గుర్తించకపోయినా కేంద్రప్రభుత్వం తమ సత్తాను తెలుసుకుని గవర్నర్(పదవినిచ్చిందని వ్యాఖ్యానించారు.
తనలాంటి వ్యక్తుల ప్రతిభాపాటవాలు వృథా కాకూడదనే తలంపుతోనే కేంద్రప్రభుత్వం తమను గుర్తించి పదవులలో కూర్చోబెడుతోందన్నారు. తనలాంటి వ్యక్తుల ప్రతిభను తమిళ ప్రజలు గుర్తించి ఉంటే ఈపాటికి ఎంపీలుగా గెలిచి కేంద్రమంత్రులుగా ఉండేవాళ్ళమని, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడి ఉండేవాళ్ళమని చెప్పారు. ఈ కార్యక్రమానికి రెండు సెల్‌ఫోన్లు చేతపట్టుకుని నడిచి వస్తుండగా ఓ పెద్దాయన రెండు సెల్‌ఫోన్లు ఎలా వాడుతున్నారని ప్రశ్నించారని, అందుకు తాను బదులిస్తూ రెండు రాష్ట్రాల పాలనా వ్యవహారాలను చూస్తున్న తనకు అదో లెక్కా అని చెప్పానని తమిళిసై అన్నారు.
తాను 48 గంటలపాటు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే అవేవీ వార్తలుగా రావడం లేదని, అయితే ఆదివారం మహాబలిపురంకార్యక్రమంలో జారిపడితే వెంటనే ఆ ఘటన పెద్ద వార్తగా మారిందని తమిళిసై విమర్శించారు.