Logo

ఐ ప్యాక్ సర్వే పేరుతో తెరపైకి గెలుపు గుర్రాలు

గెలిచే వారికి టిక్కెట్లు.. ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యం..

విజయవాడ, ఫిబ్రవరి 2,  ఆంధ్రప్రదేశ్‌లో ఐ ప్యాక్ సర్వే పేరుతో మళ్లీ గెలుపు గుర్రాల పేర్లు తెరపైకి వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం ఉన్న మంత్రులు, మాజీ మంత్రుల పేర్లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మాత్రమే మళ్లీ గెలుపు అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది మంత్రి వర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన వారిలో ఇద్దరు మాత్రమే తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాలను వైఎస్సార్సీపీ వర్గాలు తోసిపుచ్చుతున్నా ప్రజల అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో మళ్లీ గెలిచే అవకాశం ఉన్న మంత్రులు, మాజీ మంత్రుల పేర్లలో కొందరికి మాత్రమే మరోసారి గెలిచే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. 13మంది మాజీ మంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్, కొడాలి నానికి మాత్రమే మళ్లీ గెలుస్తారట. 13మందిలో మిగిలిన 11 మంది ఇంటి దారి పట్టాల్సిందేనట. మొత్తం 38 స్థానాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలకు మాత్రమే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత క్యాబినెట్ మంత్రుల్లో పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, అంజాద్ పాషా, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజాలు మళ్లీ గెలుస్తారని మిగిలిన మంత్రులంతా ఓడిపోతారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ మంత్రుల్లో 20మందికి ఓటమి ఖాయమని ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత క్యాబినెట్‌లో మంత్రివర్గ సహచరుల్లో ఐదుగురు మాత్రమే మళ్లీ ఎన్నికల్లో నెగ్గే అవకాశముందని, రాయలసీమ నుంచి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప నుంచి అంజాద్‌ బాషా ,గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామి ఉన్నారు.

టీడీపీ నుంచి అంత బలమైన అభ్యర్థులు లేకపోవడంతో గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.కోస్తా జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు మాత్రమే నెగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందిన వారు కావడం విశేషం. అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్‌ , తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మళ్లీ గెలిచే అవకాశమున్న వారి జాబితాలో ఉన్నారు.ఏపీలో ఐదుగురు మినహా మిగిలిన ఇరవై మంది మంత్రులు ఓడిపోతారని ప్రచారం జరుగుతోంది. వీరిలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, రోజా, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, గుడివాడ అమర్‌నాథ్‌, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్‌, విడదల రజిని, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరి జయరాం, కాకాణి గోవర్ధన రెడ్డి, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, ఉషశ్రీ చరణ్‌ ఉన్నారు. ఓడిపోయే జాబితాలో మాజీ మంత్రులు ఆళ్ల నాని, పుష్ప శ్రీవాణి, మేకతోటి సుచరిత, శంకరనారాయణ, బాలినేని శ్రీనివాస రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు ఉన్నారు.

మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఈ జాబితాను తోసిపుచ్చుతున్నారు. ఐ ప్యాక్ అంతర్గత సర్వే నివేదికలు సోషల్ మీడియాలో వచ్చే అవకాశం ఉండదని, అత్యంత రహస్యంగా వాటిని రూపొందిస్తారని, ముఖ్యమంత్రి స్థాయిలో కీలకమైన వ్యక్తులకు తప్ప బయటి వారికి అవి లీకయ్యే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలయ్యే వారిని ముందస్తుగా పోటీ నుంచి తప్పించడానికి అనధికారికంగా లీక్ చేసి ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కీలకమైన వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ వ్యూహాల్లో భాగంగానే ఇలాంటి నకిలీ సర్వేలను తెరపైకి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి కూడా టీడీపీకి అభ్యర్థులు లేరంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking